న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రిటైర్మంట్ దగ్గర పడుతుండడంతో, ఆయన స్థానంలో తెలుగువాడైన జస్టిస్‌రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేక ఆయనకు అడ్డంకులు ఎదురవుతాయా? ఒకవేళ అడ్డంకులు ఎదురైతే వాటిని ఎదుర్కొని జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి అవుతారా? లేదా? అనే ప్రశ్నలు న్యాయవర్గాల ద్వారా వస్తున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో 50 రోజుల్లో రిటైర్ అవుతుండగా ఆయన స్థానంలో సుప్రీం న్యాయమూర్తుల్లో ఎవరికి సీనియార్టీ ఉంటుందో వారిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఇలా అర్హతలు ఉంది జస్టిస్ రమణకు మాత్రమే. అయితే ఇటీవల కాలంలో ఆయనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారని, అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిని ఆయన ప్రభావితం చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా జస్టిస్ రమణ కుమార్తెలు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. దీనిపై విచారణ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇది ఏప్రిల్ 24 లోపు విచారణ పూర్తి అవ్వాలి. ఒక వేళ అప్పటికి కనుక విచారణ పూర్తికాకుండా ఉంటే ‘జస్టిస్ రమణ’ ప్రధాన న్యాయమూర్తి కాలేరంటున్నారు. కాగా ఈ అంతర్గత విచారణ తీర్పు ఈనెల 10 లోపు రాబోతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అంతర్గత తీర్పును ఆలస్యం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, తీర్పు ఆలస్యం అయితే ‘రమణ’కు అవకాశాలు లేకుండా పోతాయంటున్నారు. ఒక వేళ అంతర్గత విచారణలో రమణ తప్పు చేసినట్లు తేలితే ఆయనకు సీజేఐ పోస్టు దొరకదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని తేలితే ఆయనపై ఆరోపణలు చేసిన సిఎం జగన్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మార్చి నెల ‘రమణ’ భవిష్యత్‌కూ, ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్‌కు కీలకం అని చెప్పవచ్చు.