తుది దశకు చేరుకున్న యాదాద్రి పుణ్యక్షేత్రం

యాదాద్రి, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): యాదాద్రి లక్ష్మినృసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్ప సౌందర్యంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పుణ్యక్షేత్రం సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఈనెల 18న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు సోమవారం వరకు కొనసాగనున్నాయి. అలాగే, ఈనెల 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగుతాయి. దీంతో ఆ సమయానికి ముందే ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుండగా, గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 16న వసంత పంచమి, 18న రథ సప్తమి వేడుకల్ని నిర్వహించారు.

మొత్తానికి భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం ఆలయ పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నరసింహుడి క్షేత్రం భూతల స్వరంలా మారిపోయింది. కాగా, యాదాద్రి నరసింహ స్వామి ఆలయం పునర్‌నిర్మాణం తర్వాత ఎలా మారింది? ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్‌నిర్మాణం సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వంటి ఆధునిక ఆలయాలను నిర్మిస్తూనే మరోవైపు యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అని ఆ ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వైటీడీఏ అధికారులు మరింత వేగం పెంచారు. ఈ నెల చివరలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనకు రానున్నారనే సమాచారంలో ప్రధానాలయంతోపాటు ఇతర పనులను ముమ్మరంగా చేస్తున్నారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, స్తపతి వేలు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం ముందు భాగంలో గ్రేడ్‌ స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. స్టీల్, కాంక్రీట్‌తో 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవుతో 10 ఇంచుల ఎత్తులో ఈ పనులను చేస్తున్నారు. ఈ గ్రేడ్‌ స్లాబ్‌పై రాళ్లను బిగించి భక్తులు నడిచేలా పనులు చేయనున్నారు.

మరోపక్క 50కి పైగా కలశాలకు బంగారు తాపడం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయం భూగా వెలసిన గర్భాలయం వెలుపల ప్రహ్లాద చరిత్రకు సంబంధించిన 10 ఘట్టాలను పంచలోహ విగ్రహాలతో తయారు చేస్తున్నారు. వీటిని ఇటీవల అధికారులు, స్తపతులు, కలెక్టర్‌ పరిశీలించారు. గర్భాలయం వెలుపల పైభాగంలో వీటిని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం సూచనలతో శిల్పులు గర్భాలయం ముందు భాగంలో పంచ నారసింహ శిల్పాలను చెక్కారు. ప్రధానాలయం ద్వారాల పైభాగం లో శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని త్వరలో ప్రతి ష్టించేందుకు సిద్ధం చేసి వేంచేపు మండపం వద్ద పెట్టారు. అలాగే ప్రధానాలయ ద్వారాలకు ఇరువైపులా ద్వారపాలకులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామి ముందు భాగంలోని అరుగులో ఏనుగుల వరుస, పెద్దసైజులో పద్మాన్నిచెక్కే పనులు జరుగుతున్నాయి. ఈశాన్యం నుంచి కిందికి దిగినప్పుడు ఆంజనేయస్వామి ఆలయం నుంచి మండపానికి వెళ్లే వరకు శిలతో తయారు చేసిన రెయిలింగ్‌ పనులు చేస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో బలిపీఠం, ధ్వజస్తంభానికి రాగి రేకులను బిగించారు. వీటికి బంగారు తాపడం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లారు. ప్రధాన మండపంలోని ఆండాళ్‌ అమ్మవారు, ఆళ్వార్లు, రామానుజుల ఆలయ నిర్మాణాలు పూర్తి కాగా, సేన మండపం పనులు చేస్తున్నారు. ప్రధానాలయంలోని ఆళ్వార్‌ మండపంలో పైకప్పునకు రాజస్తాన్‌ నుంచి తీసుకువచ్చిన పద్మాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామిని దర్శనం చేసుకొని బయటకు వెళ్లేటప్పుడు పడమర వైపు, పంచతల రాజగోపురం వైపు, లోపల వైపు రాతి రెయిలింగ్‌ పనులు పూర్తి చేశారు. ప్రథమ ప్రాకారం, ద్వితీయ ప్రాకారం వెలుపల సైతం రాతి ఫ్లోరింగ్‌ వేస్తున్నారు. ఇప్పటికే వేంచేపు మండపం పనులు పూర్తి కాగా, బ్రహ్మోత్సవ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయి.

Latest News