Uncategorized

మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ మరో కీలక నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్‌ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్‌ దాఖలుకు గడువుగా పేర్కొంది.

వివిధ పార్టీల అభ్యర్థులు 56 మంది మృతి చెందినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కాగా, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు, అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.