ఆహారంస్థానికం

ఏపీలో “అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్” ఏర్పాటు.

  • అవుట్‌సోర్సింగ్ నియామకాల కోసం అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రారంభం.

విజయవాడ: అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలన్నీ పూర్తి పారదర్శకతతో, అవినీతి రహితంగా చేపట్టేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం “అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్” ను ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వనక్కరలేదు. అదేవిధంగా జీతాలు తీసుకునేటప్పుడు లంచాలు, కమీషన్లు ఇవ్వనక్కరలేదు. దళారులను ఆశ్రయించనక్కరలేదు. గత ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టే నియామకాలు ఏజెన్సీల ద్వారా జరుగుతుండేవి. సకాలంలో జీతాలు రాకపోవడం, జీతాలు చెల్లింపుల్లో కమీషన్లు, ఈ.పి.ఎఫ్. సక్రమంగా చెల్లించకపోవడం వంటి పలు సమస్యలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎదురవుతూ ఉండేవి. ఈ సమస్యలన్నింటికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ “అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్” ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ కార్పొరేషన్‌ ను ముఖ్యమంత్రి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. అలాగే ఈ ఉద్యోగాలలో 50 శాతం ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ అభ్యర్థులకు రిజెర్వేషన్లు కల్పిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ.ఎస్.ఐ, ఈ.పీ.ఎఫ్ సౌకర్యాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు ప్ర‌తి నెలా క్రమం తప్పకుండా జీతాల చెల్లింపు జరుగుతుంది. ఇప్పటికే నియమితులైన 47 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తింపచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.