రాష్ట్రీయం

ఆదర్శవంతంగా వైఎస్సార్‌ కాలనీలు

అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, సౌకర్యవంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. ‘‘సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్‌ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లాదంగా తీర్చిదిద్దాలి’’ అని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు.

ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం తెలిపారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్‌ ఎంచుకున్నా లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ ఉండాలని, ప్రతి 1,500 నుంచి 5 వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను పరిశీలించారు. కాలనీల్లో ఆహ్లాదం ఆరోగ్యం అందించే మొక్కలను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ప్రతీప్‌ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, స్టేట్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.